Monday, July 20, 2009

ఆంధ్ర ప్రదేశ్ లో గమ్యం, పట్టాల్లేని ప్రగతి- 2

2006-07 నాటికి భారత దేశంలో ఎనభై లక్షల పైనే మోటారు వాహనాలు తయారవుతున్నాయి. వీటిలో కార్లు, ట్రక్కులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు- అన్ని రకాల వాహనాలు వున్నాయి. నా అంచనా ప్రకారం మొత్తం దేశంలో జరిగే వాహానాల అమ్మకాల్లో 5-10 శాతం దాకా, అంటే సుమారు 4-8 లక్షల దాకా వివిధ రకాల వాహానాల సేల్స్, ఆంధ్ర ప్రదేశ్ లోనే అవుతుండ వచ్చు. వాటిలో ఏ ఒక్కటైనా ఆంధ్ర ప్రదేశ్ లో తయారవుతుందా? లేదు.

మీరు వాడే మారుతి నుండి సెవెన్ సీటర్ ఆటో దాకా, బి.ఎం.డబ్ల్యు నుండి ట్రాలీ టెంపో దాకా, వోల్వో బస్సు నుండి టీ.వీ.ఎస్ మోపెడ్ దాకా- ఏ ఒక్కటి ఆంధ్రలో తయారు కావటం లేదు.

మీరు రోజూ వాడే టూత్ పేస్టులు, సబ్బులూ, షాంపూలు, కూల్ డ్రింకులు, బిస్కెట్స్, టీ- ఇలాంటి చిల్లర సరుకులే కాదు, ఫ్రిడ్జిలు, టీవీలు, కంప్యూటర్లు, ఏసీలు, మోటార్ సైకిళ్ళు, కార్ల లాంటి విలువైన వస్తువులు కూడా వేరే రాష్ట్రాలనుంచి దాదాపు పూర్తిగా దిగుమతవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో పారిశ్రామీకరణ యెంత మేరకు జరిగిందనుకోవాలి? మనం పంతొమ్మిదవ శతాబ్దం నుంచి ఎన్ని అడుగులు ఇరవై ఒకటో శతాబ్దం వైపు వేసినట్టు?

వికిపిడియా లోని పేజిలో భారత్ లో కార్లు తయారు చేస్తున్న అన్ని కంపెనీల ఉత్పత్తి కేంద్రాల వివరాలను పరిశీలిస్తే మనకు మోటార్ వాహానాల తయారీ ముఖ్యంగా ఐదారు రాష్ట్రాల లోనే ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తూంది. ఏ రాష్ట్రాలవీ? మహారాష్ట్ర, తమిళ్ నాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్, హర్యానా, కర్ణాటక ప్రముఖంగా కనిపిస్తున్నాయి. యీ పోస్ట్ లో పేర్కొన్న భారత్ దేశపు టాప్ కన్సుమర్ బ్రాండ్స్ ని కూడా మళ్ళీ ఓ సారి పరిశీలిస్తే దాదాపు మెజారిటీ బ్రాండ్స్ అవే ఐదారు రాష్ట్రాల్లోని కంపెనీలవని అర్థమవుతుంది.

ఆ రాష్ట్రాలకీ ఆంధ్ర ప్రదేశ్ కి మధ్య ఎందుకింత వ్యత్యాసం? పారిశ్రామిక అభివృద్ధిలో ఇంత తేడా ఎందుకుంది? మీరు మూడు రకాల కారణాలు వెతకొచ్చు- భౌగోళికమైనవి, చారిత్రకమైనవి, సామాజికమైనవి. లేదా ఆ మూడింటి కాంబినేషన్లు. మొదటి రెండు రకాల కారణాలను కొంత సేపు పక్కన పెట్టి ఒక్కసారి ఆయా రాష్ట్రాల్లో సమాజ సంపదకూ, ప్రగతికీ రఫ్ సూచికైన తలసరి ఆదాయం లెక్కల్ని గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తూంది: పైన పేర్కొన్న అన్ని రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఆంధ్ర ప్రదేశ్ కన్నా ఎక్కువగా వుంది, కొన్ని దశాబ్దాలుగా. ఒక ప్రశ్న- అక్కడ తలసరి ఆదాయం ఎక్కువగా వుంది కాబట్టి పారిశ్రామిక అభివృద్ది ఎక్కువగా జరిగిందనుకోవాలా? లేక, అభివృద్ది బాగా వుందని ఆదాయాలు పెరిగాయనుకోవాలా?

(ఇంకా వుంది).

Saturday, July 18, 2009

ఆంధ్ర ప్రదేశ్ లో గమ్యం, పట్టాల్లేని ప్రగతి

ఒకట్రెండు రోజుల క్రితం 'రాష్ట్రానికి యూ పీ ఎ చేయూత' అని ఆంద్ర ప్రభలోవార్త చూసి మొదలయిన 'ట్రైన్ అఫ్ తాట్' ఫలితమిది:

సుమారు పదిహేనేళ్ళుగా కేంద్రం మంత్రివర్గంలో ఏ ప్రధాన (ఫైనాన్స్, హోం, విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమలు, వ్యవసాయం, రైల్వే, ఐటీ, టెలికాం తదితర) శాఖలోనూ ఆంద్ర రాష్ట్రంనుంచి ఏ నాయకుడూ కేబినేట్ మంత్రిగా లేడు. అది రాజకీయంగా డిల్లీలో తెలుగువారికి దక్కుతున్న ప్రాధాన్యత. గత రెండు దశాబ్దాలు ఆ పైనుంచి రైల్వే శాఖవారు ఏ భారి లైన్ గానీ ట్రాక్ గానీ ఫ్యాక్టరీ గానీ యోచించినా, వారి ఆలోచనలో ఆంధ్రకు తావు లేదు. ఒక్కసారి నేను ఈ పోస్టులో కోట్ చేసిన రైల్ డెన్సిటీ గురించి చిట్టా బసు గారు వెలికి తీసిన వివరాలు చూడండి:

సగటు రైల్ డెన్సిటీ (రూట్ కి.మీ /ప్రతి వేయి కి.మీ)
భారత దేశం- 19.13
డిల్లి- 138.2
పశ్చిమ బెంగాల్ - 43.4
పంజాబ్- 41.6
హర్యానా- 36.1
బీహార్- 35.9
ఉత్తర ప్రదేశ్- 35.8
తమిళ్ నాడు- 32.1
అస్సాం- 31.9
కేరళ- 27
గుజరాత్- 26.9
ఝార్ఖండ్- 24.3
ఆంధ్ర ప్రదేశ్- 18.9

అంటే 2004 నాటికే ఆంధ్ర ప్రదేశ్లో రైల్ డెన్సిటీ దేశంలో సగటు రైల్ డెన్సిటీ కన్నా తక్కువ. ఈ ఐదేళ్ళ లాలూ హయాంలో పరిస్థితి ఇంకా దిగజారి వుంటుంది.

ఇక పరిశ్రమల విషయానికొద్దాం- సంస్కరణల వలన రాష్ట్రాల్లో పెట్టుబడులపై కేంద్ర ప్రమేయం తగ్గిందిన్న ఆలోచన చాలా మందిలో వుంది. అదే నిజమైతే కొన్ని కీలక (వాణిజ్యం, పరిశ్రమలు, రైల్వే, ఐటీ, టెలికాం) శాఖలకోసం యూ పీ ఎ భాగస్వాములు గత ప్రభుత్వంలో, ఈసారి అంతగా పోటీపడి వుండరు . అదే ధోరణి ఎన్ డి ఎ కాలంలోనూ గమనించాం. రాష్ట్రాలు ఎంతగా ప్రయత్నించినా పెట్టుబడిదారులు నానా అనుమతులు, రాయితీలూ ఇతర రకాల సహాయం కోసం డిల్లీ చుట్టూ తిరగాల్సిందే. విదేశీ పెట్టుబడులయితే కేంద్రం ద్వారాల్లోంచే రావాలి. అక్కడ ఆంధ్ర అవసరాలు పట్టించుకొనే మంత్రులు, నాయకులెవరూ?

చమురు, సహజ వాయువు, బాక్సైట్, అల్యూమినియం- ఇలాంటి రంగాల్లో ఎప్పడి నుండో క్రమంగా జరుగుతున్న దీర్ఘకాలిక పెట్టుబడులు తప్ప ఏ కీలక రంగంలో- ఆటోమొబైల్, ఎలెక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, కన్సుమర్ గూడ్స్, కాపిటల్ ఎక్విప్మెంట్- కూడా చెప్పుకోదగ్గ పెట్టుబడులు కానీ కొత్త కంపెనీలు కానీ గత పదేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ కి రాలేదు. ఒక్కసారి ఎకానమిక్ టైమ్స్ ఈ సంవత్సరం నిర్వహించిన భారత దేశంలో ఉన్నత శ్రేణి బ్రాండ్స్ పై సర్వే ఫలితాలు చూడండి:

1) Nokia 2) Colgate 3) Lux 4) Lifebuoy 5) Dettol 6) Horlicks 7) Tata salt 8) Pepsodent 9) Brittania 10) Reliance mobile 11) Close-Up 12) Airtel 13) State Bank of India 14) Glucon D 15) Clinic Plus 16) Pond's 17) LIC 18) Fair & Lovely 19) BSNL 20) LG
21) Good Knight 22) Parle Products 23) Bisleri 24) Tata Tea 25) Vicks 26) Pepsi 27) Ariel 28) Dabur 29) Frooti
30) Vodafone 31) Mirinda 32) Coca-Cola 33) Hero Honda 34) Bournvita 35) Maggi 36) Bata 37) Tata Indicom 38) Sony 39) Thums Up 40) Titan 41) Surf 42) Philips 43) RIN 44) Godrej 45) Videocon 46) Maaza 47) Amul 48) Samsung 49) Johnson & Johnson 50) Head & Shoulders 51) Complan 52) Sunsilk 53) Samsung Mobile Phones 54) Fevicol 55) Iodex 56) All Out 57) LG Mobile Phones 58) Limca 59) Cadbury 60) Fanta 61) Rasna 62) Zandu Balm 63) Dabur Amla 64) Onida 65) Asian Paints 66) Cinthol 67) Moov 68) Sony Ericssion 69) 7 Up 70) Hajmola 71) Amrutanjan Balm 72) Tide 73) Pantene 74) Vim 75) Wheel 76) Parachute 77) Boroplus 78) Boost 79) Vaseline 80) Mortein 81) Motorola 82) Maruti 83) Rexona 84) Dove 85) Sonata Watches 86) Sunfeast 87) Nirma 88) Crocin 89) Medimix 90) Ujala 91) VIP Luggage 92) Bank of India 93) HMT 94) Sprite 95) Pears 96) Boroline 97) Big Bazaar 98) ICICI Bank 99) Nestle 100) Bajaj Motorcycles.

ఆ వంద బ్రాండ్స్ లో ఏ ఒక్కటీ ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన కంపెని తయారు చేసే బ్రాండ్ కాదు. వాటిలో కొన్నింటిని విదేశీ కంపెనీలు తయారు (ఇక్కడి తమ గ్రూప్ కంపెనీల ద్వారా) చేస్తుంటే, చాలా మటుకు దేశీయ కంపెనీలే తయారు చేస్తున్నాయి. ఈ తయారు/ఉత్పత్తి చేసే కంపెనీల్లో ఏ ఒక్క కంపెని ప్రధాన కార్యాలయం కానీ, ప్రధాన ఉత్పత్తి కేంద్రం కానీ ఆంధ్ర ప్రదేశ్ లో లేదు. అంటే ఆంధ్ర ప్రదేశ్ ఈ కంపెనీలకి కేవలం ఒక మార్కెట్ మాత్రమే- కొన్ని దశాబ్దాల క్రితం బ్రిటిష్ కంపెనీలకి మార్కెట్ అయినట్టుగా.

( ఇంకా వుంది).

Friday, July 17, 2009

ప్రజలంతా మంత్రి తమ్ముడి బావమరిది కొడుకులైతే ...

...రక్షణకు కొదవే వుండదు. నిన్న గాక మొన్న సంతోష్ నగర్లో చూసా, ఒక చంటి పిల్లాడి బర్త్ డేకి కనీసం యాభై మంది పోలీస్ సిబ్బంది, ఒక ఎ సి పీ ఇంకా కొందరు ఇన్స్పెక్టర్లతో సహా, కాపలా కాస్తున్నారు. మినిష్టరు, ఆమె బ్లాకు కాట్లో గ్రేయ్ హౌండ్లో, ఇంకా రానే లేదు. తీవ్రవాదుల ఆచూకీ అడగాల్సింది పాకిస్తాన్ని కాదు.

మొదటి మాట

తెలుగులో బ్లాగ్గింగ్ అంటే చాలా ఆనందంగా వుంది. ఇంత కాలం రాస్తూనే వున్నాతెలుగులో రాయడానికి బద్దకించాను, టెకీని కాదు కాబట్టి కొంత భయ పడ్డాను, టూల్స్ సరిగ్గా అర్థం చేసుకోలేక. టైపింగ్ రాకపోవడం (ఇంగ్లీషులో కూడా) మరో కారణం. ఇప్పుడు ధైర్యం చేస్తున్నాను.

అందరికీ హలోలు, నమస్కారాలు.