2006-07 నాటికి భారత దేశంలో ఎనభై లక్షల పైనే మోటారు వాహనాలు తయారవుతున్నాయి. వీటిలో కార్లు, ట్రక్కులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు- అన్ని రకాల వాహనాలు వున్నాయి. నా అంచనా ప్రకారం మొత్తం దేశంలో జరిగే వాహానాల అమ్మకాల్లో 5-10 శాతం దాకా, అంటే సుమారు 4-8 లక్షల దాకా వివిధ రకాల వాహానాల సేల్స్, ఆంధ్ర ప్రదేశ్ లోనే అవుతుండ వచ్చు. వాటిలో ఏ ఒక్కటైనా ఆంధ్ర ప్రదేశ్ లో తయారవుతుందా? లేదు.
మీరు వాడే మారుతి నుండి సెవెన్ సీటర్ ఆటో దాకా, బి.ఎం.డబ్ల్యు నుండి ట్రాలీ టెంపో దాకా, వోల్వో బస్సు నుండి టీ.వీ.ఎస్ మోపెడ్ దాకా- ఏ ఒక్కటి ఆంధ్రలో తయారు కావటం లేదు.
మీరు రోజూ వాడే టూత్ పేస్టులు, సబ్బులూ, షాంపూలు, కూల్ డ్రింకులు, బిస్కెట్స్, టీ- ఇలాంటి చిల్లర సరుకులే కాదు, ఫ్రిడ్జిలు, టీవీలు, కంప్యూటర్లు, ఏసీలు, మోటార్ సైకిళ్ళు, కార్ల లాంటి విలువైన వస్తువులు కూడా వేరే రాష్ట్రాలనుంచి దాదాపు పూర్తిగా దిగుమతవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో పారిశ్రామీకరణ యెంత మేరకు జరిగిందనుకోవాలి? మనం పంతొమ్మిదవ శతాబ్దం నుంచి ఎన్ని అడుగులు ఇరవై ఒకటో శతాబ్దం వైపు వేసినట్టు?
వికిపిడియా లోని ఈ పేజిలో భారత్ లో కార్లు తయారు చేస్తున్న అన్ని కంపెనీల ఉత్పత్తి కేంద్రాల వివరాలను పరిశీలిస్తే మనకు మోటార్ వాహానాల తయారీ ముఖ్యంగా ఐదారు రాష్ట్రాల లోనే ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తూంది. ఏ రాష్ట్రాలవీ? మహారాష్ట్ర, తమిళ్ నాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్, హర్యానా, కర్ణాటక ప్రముఖంగా కనిపిస్తున్నాయి. యీ పోస్ట్ లో పేర్కొన్న భారత్ దేశపు టాప్ కన్సుమర్ బ్రాండ్స్ ని కూడా మళ్ళీ ఓ సారి పరిశీలిస్తే దాదాపు మెజారిటీ బ్రాండ్స్ అవే ఐదారు రాష్ట్రాల్లోని కంపెనీలవని అర్థమవుతుంది.
ఆ రాష్ట్రాలకీ ఆంధ్ర ప్రదేశ్ కి మధ్య ఎందుకింత వ్యత్యాసం? పారిశ్రామిక అభివృద్ధిలో ఇంత తేడా ఎందుకుంది? మీరు మూడు రకాల కారణాలు వెతకొచ్చు- భౌగోళికమైనవి, చారిత్రకమైనవి, సామాజికమైనవి. లేదా ఆ మూడింటి కాంబినేషన్లు. మొదటి రెండు రకాల కారణాలను కొంత సేపు పక్కన పెట్టి ఒక్కసారి ఆయా రాష్ట్రాల్లో సమాజ సంపదకూ, ప్రగతికీ రఫ్ సూచికైన తలసరి ఆదాయం లెక్కల్ని గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తూంది: పైన పేర్కొన్న అన్ని రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఆంధ్ర ప్రదేశ్ కన్నా ఎక్కువగా వుంది, కొన్ని దశాబ్దాలుగా. ఒక ప్రశ్న- అక్కడ తలసరి ఆదాయం ఎక్కువగా వుంది కాబట్టి పారిశ్రామిక అభివృద్ది ఎక్కువగా జరిగిందనుకోవాలా? లేక, అభివృద్ది బాగా వుందని ఆదాయాలు పెరిగాయనుకోవాలా?
(ఇంకా వుంది).
ఒక యోగి జీవన గాథ
1 week ago