Thursday, September 20, 2012

మనం మేమవుదాం

నీకూ నాకూ
మధ్య అడ్డుగోడై
ప్రేమా దోమా
యేదైనా వుంటే
కూల్చేద్దాం!
మనం మేమవుదాం
చేతనైనంత వెలమవుదాం
వాడికి మేతవుదాం
దేవ్డిల వెట్టవుదాం
రెచ్చిపోయి రెడ్డవదాం
అదందాం ఇదందాం
అదవదాం ఇదవదాం
అడ్డంగా నరికేద్దాం
యెవడూ దొరక్క పోతే
పోనీ పోతే
యీ ఫోరడి ప్రాణం
యింకో పోరడి ప్రాణం
ఆత్మహత్యై
ఊదుబత్తై
ఉద్యమ పద్దై
గల్లా యెగిరేసుకొని
చెప్పుకొనే గొప్పై
నీ గుడిసెల నిప్పై
వాడి భవన్లో నోట్ల కుప్పై
నోటికొచ్చిన తత్వమై

అమ్మ కడుపును తన్నిన
అయోమయమై
నిన్ను చంపిన వాడి
అమరత్వమై...

అమరత్వం
ఆధ్యాత్మ్యం
అల్లమెల్లిగడ్డ
వాడవసరం
మన ధర్మం..
అంతా యెనకట్లాగనె
సనాతనంగా
తలొంచుకుని పాటిద్దాం
మెడలిద్దాం యేళ్ళిద్దాం
పాలిద్దాం చేళ్ళిద్దాం
వాడింట్ల కాకి
పక్కోడు కొడితే
మనం గాయపడదాం
వాళ్ళిద్దరి నదులు
వాళ్ళకు పంచుకుందాం
మన నోట్ల మట్టంతా మనదే కదా?
పెంచుకుందాం..
వంచుకుందాం
వాళ్ళిద్దరి పగలూ
పోటీలూ
మన కుండళ్ళోకి
గొంతుళ్ళోకి గుండెళ్ళోకి
బేగాని షాదిల..
అంతా అప్పట్లెక్కనే
బుద్ధున్ని కూల్చి
శివున్ని
జైనుల్ని కొట్టి
విష్ణువుకి పెడదాం
మనం వండిన ప్రసాదం
మనం అడుక్కుందాం.
~~~

మొదట kufr లో ఇక్కడ పోస్ట్ చేసాను, మార్చి 2011 లో.

Thursday, December 3, 2009

వీళ్ళు లాఠీ దెబ్బలు తింటే..


లాభం వీళ్లకా?

ఏమో. మొదటి వర్గం వారిలో ఎక్కువ మంది బీసీలు, దళితులే వుంటారు. రెండో వర్గంలో మెజార్టీ అగ్ర కులాలదే. పోయిన ఆదివారం మొదటి వర్గం వారు చావు దెబ్బలు తిని తేరుకునే లోపే రెండో వర్గంవారు తమ తెలంగాణా ప్రేమని you tube కేక్కించేసారు.

మొన్న ఎన్నికల్లో రెండో వర్గంలోని (అమెరికాలో) తెలంగాణా 'సెటిలర్స్' లో కొందరు టికెట్ల కోసం డబ్బు సంచులతో హైదరాబాదులో వాలారు. ఆ దేశ భక్తుల్లో కొందరు ఈ వీడియోలో కూడా ఉండొచ్చు. ఈ ఉద్యమం ఎవరి లాభాపేక్ష కోసం, ఎవరి త్యాగాలపై నిర్మించ బడుతుందో గమనించాలి.

Monday, November 23, 2009

ఇది ఉద్యమమా?

ఇదో ఫ్యామిలీ బిజినెస్. తండ్రి, కొడుకు, కూతురు, మేనల్లుడు- అందరూ గల్ల మీద గూసుంటారు. ధర్నాలు, దొమ్మీల దంద జేస్తరు. పోయిన ఉద్యోగాలు దళితులవీ, బీసీలవి. ఈ దొరల కొచ్చిన సమస్యేంది? పట్నంల ఇల్లు వాకిళ్ళు లేక గుడిసేల్ల, రోడ్లమీద, కిరాయిన్డ్లల్ల కాపురం జేసేది అదే దళితులూ, బీసీలు, ముసల్మాన్లు- ఈ రెడ్లకీ, వెలమలకొచ్చిన నష్టమేంది? చంద్రశేఖర్ రావు సుట్టాల్లందరికీ పెద్ద, పెద్ద కంపెనీలు, వ్యాపారాలున్నాయి. వాళ్ల చేతులకీ కావలసినన్ని సర్కార్ కాంట్రాక్టు లూ, అల్మారిలల్ల కుక్కుకోవడానికి నగలూ, నగదూ ఏ గవర్నమెంట్ మారినా వరదలాగ వొస్తనే వున్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీ లనుంచి సాఫ్ట్ వేర్ కంపెనీల దాక, మెడికల్ కాలేజీ లనుంచి ఇంటర్ నేషనల్ స్కూళ్ళ దాక- తెలంగాణా రెడ్లకి, వెలమలకి లేని అవకాశాలేన్టివి? ఊల్లళ్ల సగం భూమి ఇంకా వాళ్ల చేతుల్లనే వుండే..వాల్లకొచ్చిన అడ్దేంది?

ఉస్మానియా యునివర్సిటీల హోలీ పండుగ ఆడుతరంట. అది తెలంగాణా సంస్కృతి అంట. ఆడించే పంతుల్లకి సర్కారు కొలువులున్నయి. గొర్రెల్లాగా ఆడే పోరాగాల్లకి రేపు అవే ఉద్యోగాలు ఇస్తరా? ఎంత మందికిస్తారు? బీసీల్లల్ల, దళితుల్లల్ల వందకి ముగ్గురు, ఒక్కరు లెక్కన డిగ్రీ పాస్ అవుతున్నరని డిల్లీ సర్కారు లెక్కలు. తెలంగాణా లాంటి వెనుకబడిన ప్రాంతంల పాస్ అయ్యే పోరగాల్లు ఇంక తక్కువనే వుంటరు. ఆ పాస్ అయిన పోరగాల్లల్ల ఎందరు యునివర్సిటీ కి పోతున్రు? ఎమ్యేలు, ఏమ్బీఎలు చేస్తున్రు? తెలంగాణా రాష్ట్ర మొచ్చి ఈ ప్రతి యేడు పాస్ అయిన లక్ష మందికో అయిదు లక్షల మందికో ఫ్యాను కిందో, ఏసీ పక్కనో గూసునే సర్కారు ఉద్యోగాలిస్తే, ప్రతి యేడు పుట్టే మిగితా ఇరవై లక్షల మంది ఏం గావాలె?

కేసీయార్ నడుగుతే యగ్యాలు, హోమాలు గూడ తెలంగాణా సంస్కృతే అంటడు. బాగనె వుంది. మరి గుళ్లకే పోలేని దళితులకి, పల్లకీలు మోసి, బాజా మోగించే బీసీలకి ఈ సంస్క్రుతిల ఏం పాత్రున్నదో? వీళ్ళకేదో ఒరుగుతదని మభ్య పెట్టె యునివర్సిటీ లల్ల భద్రమైన కొలువులు జేసే పంతుల్లనేమనలే? జైశంకర్ని పిలిచినట్టు ఆచార్యులూ అనీ మర్యాదగా పిలిచి గుండు గొట్టిచ్చుకోవాల్నేమో? సంస్కృతీ సంస్కృతం రెండూ ఎప్పుడూ కలిసే ఉంటయి గదా! వీళ్ళు కులవ్యవస్థని ఎదిరించి, దళితున్ని ముఖ్య మంత్రిని జేస్తరంట. దానికి ఏ సిద్ధాంతి ముహూర్తం పెడతడో.

ప్రజస్వామ్యంల ఒకర్ని ముఖ్య మంత్రిని జేస్తననే హక్కు ప్రజలకే వుంది, ప్రజల్లో ఒక్కరికి గాదు. ఈ నీతి గురించి పట్టించుకోని నాయకుణ్ణి ఏమనాలె? ఎనకటికి దొర అనెటోల్లు. అదే పొగరు, అదే అహం, అదే చాల్బాజి తనం, అదే కుతంత్రం, అదే కులతత్వం, అదే అద్రగనం. ఇది ఉద్యమమా?

Monday, August 10, 2009

నిజాం భార్యలు

నలుగురు ఆడపిల్లలు జరీ
పట్టు వస్త్రాలు
బిగుతైన చిరునవ్వులతో,
నెమ్మదిగా చేతులు, మెడలు,
ముఖాలపై బిగుసుకుంటున్న బంగారo ఉచ్చులో.

తొందరగా వయసు మీరిన పిల్లలు వాళ్లు
వాళ్లు స్నేహితులా? వాళ్లు
ముక్కలై దొరికిన అధికారాన్ని పంచుకున్నారా
బొమ్మలు, వజ్రాలు,
రాత్రులు ఇచ్చిపుచ్చుకున్నట్టు? లేక
పాయసం ఎవరు దక్కించుకుంటారో అని కాంక్షగా చూసేవారా?
కొన్ని సమయాల్లో స్నానం చేసేవారు కాదా?

బహుశా, వాళ్ళల్లో ముగ్గురు
నాలుగో పిల్లకి వ్యతిరేకంగా జట్టుకట్టుంటారు, ఆమె
పక్కపై కప్పలు వదిలేయడానికి, పరుపుకింద వేరుసెనగ
పప్పు పారేయడానికి, ఆమె టీలో
ఉమ్మేయడానికి.

మనకు తెలియదు. ఈ
ఫోటోలో, వాళ్లు
పరదా నుండి విడుదల కాబడి,
భయంతో గుడ్లప్పగించి కెమెరా ఫ్లాష్ లోకి
చూస్తున్న నలుగురు ఆడ పిల్లలు మాత్రమే.

- అనిందితా సేన్ గుప్తా ఆంగ్ల కవిత 'the nizam's wives' కి నా అనువాదం. మూల కవిత 'కృత్య' లో ప్రచురించబడింది.

Friday, August 7, 2009

మత్స్యగంధి

నా శరీరం ఓ వాసనల
కథ.

అప్పుడు నేను చిన్న పిల్లని
ఇంకోలా వాసనలు వెదజల్లడం
తెలియనిదాన్ని.

బెస్త దాని కూతుర్ని
బెస్త తండ్రి ప్రేమలో,
చేపలు ఒకటే తెలిసినదాన్ని. వెండి, నలుపు,
కాషాయ బాణాల్లా,
ఎగిసిపడుతున్న చేపలు. వాటిని ప్రేమించాను
వాటిలాగే
వాసనకొట్టాను.

మత్స్యగంధి. అప్పుడు నేను
మత్స్యగంధిని.

పరాశరుడు నా వాసన పసిగట్టాడు
కామంతో నా వెంటపడి నన్ను
నానా పేర్లతో పిలిచాడు.

కాని పరాశరా, నేను పని చేస్తాను నువ్వు చేయవు.

నువ్వు దిమ్మరిలా తిరుగుతావు ఆలోచిస్తూ
నీకా స్వేచ్చా, తీరికా వుంది.
నేను తెడ్డు వేస్తూ, చేపలు పడుతూ, మా నాన్నతో శ్రమించే దాన్ని.
నేను పని చేస్తాను. నువ్వు చేయవు.

నేను నీ ప్రారబ్దాన్ని, నీ రహస్యాన్ని.
నువ్వు నన్ను ద్వేషిస్తూ కోరుకుంటావు
నాకోసం సమర్పించుకుంటావు
సువాసనల వరాల్ని.

ఇప్పుడు నేను మైళ్ళ దూరం మల్లెల వాసన వెదజల్లుతున్నాను
మగాళ్ళు ఆ వాసన చూసి లేస్తారు
ఆ వాసన చూసి చస్తారు
నా చుట్టూ.

ఈ నకిలీ చర్మపు వాసన యెంత కడిగినా పోదిప్పుడు.
ఒంటరిగా అంతఃపురాల్లో పచార్లు చేస్తున్నానిప్పుడు
నా చేప వాసన్ని, నా పేరును గుర్తుచేసుకుంటూ.

అందరు ఆడవాళ్ళు నా లాంటి వాసనే వెదజల్లుతున్నారిప్పుడు.
నేను సత్యవతిని
నాకిప్పుడు నిజం తెలుసు.

- నీతూ దాస్ ఆంగ్ల కవితకు స్వేచ్చానువాదం. నీతూ దాస్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

Tuesday, August 4, 2009

తెలివైన సబ్బు స్వగతం

నేను, ఒకప్పటి చక్కని పచ్చని సువాసనలు వెదజల్లే సబ్బు బిళ్ళని
ఇప్పుడు మిగిలిన జీవితమంతా
ఒక మెరిసే ఫిలిం పొరలా బతకాలి

నీ బాత్రూం నేలలో కలసిపోయి
నీ కోసం నా జీవితమంతా కష్టపడ్డాను
అరిగిపోయాను

నా చర్మాన్ని నీ చర్మానికి రుద్దుతూ
నా ఆత్మ నురగలు కక్కగా

నాకు తెలుసు
నీ శరీరం పై ప్రతి వెంట్రుక వేరు
నీ శరీరం గురించి నాకు తెలిసినంత
నీ నేస్తానికి కూడా తెలియదు
దానిలోని ప్రతి రంధ్రం నాకు సుపరిచయమే
నాకు తెలుసు
దాని ప్రతి వంపు
ప్రతి లోతూ
నా శరీరం నాకు తెల్సినంతగా
దాని పటం
నా మెమరీ లో
నిక్షిప్తమై వుంది.

నేను బలహీనున్నే కావచ్చు
ఎవరినైనా జాతినుంచి వెలి వేయలేకపోవచ్చు
చెత్తనేరుకునే మురికివాన్నే కావచ్చు
అందరికన్నా తక్కువ వాన్నే కావచ్చు

ఇప్పుడు నీ బాత్రూంలోనే కూర్చుని వున్నా
నేలనైనట్టు నటిస్తూ
నా పై నీ కాలు ఎప్పుడు మోపుతావా అని వేచి చూస్తూ.
-----------------------------

సచిన్ కేత్కర్ మరాఠీ కవిత ఆంగ్ల అనువాదానికి స్వేచ్చానువాదం.

Monday, July 20, 2009

ఆంధ్ర ప్రదేశ్ లో గమ్యం, పట్టాల్లేని ప్రగతి- 2

2006-07 నాటికి భారత దేశంలో ఎనభై లక్షల పైనే మోటారు వాహనాలు తయారవుతున్నాయి. వీటిలో కార్లు, ట్రక్కులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు- అన్ని రకాల వాహనాలు వున్నాయి. నా అంచనా ప్రకారం మొత్తం దేశంలో జరిగే వాహానాల అమ్మకాల్లో 5-10 శాతం దాకా, అంటే సుమారు 4-8 లక్షల దాకా వివిధ రకాల వాహానాల సేల్స్, ఆంధ్ర ప్రదేశ్ లోనే అవుతుండ వచ్చు. వాటిలో ఏ ఒక్కటైనా ఆంధ్ర ప్రదేశ్ లో తయారవుతుందా? లేదు.

మీరు వాడే మారుతి నుండి సెవెన్ సీటర్ ఆటో దాకా, బి.ఎం.డబ్ల్యు నుండి ట్రాలీ టెంపో దాకా, వోల్వో బస్సు నుండి టీ.వీ.ఎస్ మోపెడ్ దాకా- ఏ ఒక్కటి ఆంధ్రలో తయారు కావటం లేదు.

మీరు రోజూ వాడే టూత్ పేస్టులు, సబ్బులూ, షాంపూలు, కూల్ డ్రింకులు, బిస్కెట్స్, టీ- ఇలాంటి చిల్లర సరుకులే కాదు, ఫ్రిడ్జిలు, టీవీలు, కంప్యూటర్లు, ఏసీలు, మోటార్ సైకిళ్ళు, కార్ల లాంటి విలువైన వస్తువులు కూడా వేరే రాష్ట్రాలనుంచి దాదాపు పూర్తిగా దిగుమతవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో పారిశ్రామీకరణ యెంత మేరకు జరిగిందనుకోవాలి? మనం పంతొమ్మిదవ శతాబ్దం నుంచి ఎన్ని అడుగులు ఇరవై ఒకటో శతాబ్దం వైపు వేసినట్టు?

వికిపిడియా లోని పేజిలో భారత్ లో కార్లు తయారు చేస్తున్న అన్ని కంపెనీల ఉత్పత్తి కేంద్రాల వివరాలను పరిశీలిస్తే మనకు మోటార్ వాహానాల తయారీ ముఖ్యంగా ఐదారు రాష్ట్రాల లోనే ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తూంది. ఏ రాష్ట్రాలవీ? మహారాష్ట్ర, తమిళ్ నాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్, హర్యానా, కర్ణాటక ప్రముఖంగా కనిపిస్తున్నాయి. యీ పోస్ట్ లో పేర్కొన్న భారత్ దేశపు టాప్ కన్సుమర్ బ్రాండ్స్ ని కూడా మళ్ళీ ఓ సారి పరిశీలిస్తే దాదాపు మెజారిటీ బ్రాండ్స్ అవే ఐదారు రాష్ట్రాల్లోని కంపెనీలవని అర్థమవుతుంది.

ఆ రాష్ట్రాలకీ ఆంధ్ర ప్రదేశ్ కి మధ్య ఎందుకింత వ్యత్యాసం? పారిశ్రామిక అభివృద్ధిలో ఇంత తేడా ఎందుకుంది? మీరు మూడు రకాల కారణాలు వెతకొచ్చు- భౌగోళికమైనవి, చారిత్రకమైనవి, సామాజికమైనవి. లేదా ఆ మూడింటి కాంబినేషన్లు. మొదటి రెండు రకాల కారణాలను కొంత సేపు పక్కన పెట్టి ఒక్కసారి ఆయా రాష్ట్రాల్లో సమాజ సంపదకూ, ప్రగతికీ రఫ్ సూచికైన తలసరి ఆదాయం లెక్కల్ని గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తూంది: పైన పేర్కొన్న అన్ని రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఆంధ్ర ప్రదేశ్ కన్నా ఎక్కువగా వుంది, కొన్ని దశాబ్దాలుగా. ఒక ప్రశ్న- అక్కడ తలసరి ఆదాయం ఎక్కువగా వుంది కాబట్టి పారిశ్రామిక అభివృద్ది ఎక్కువగా జరిగిందనుకోవాలా? లేక, అభివృద్ది బాగా వుందని ఆదాయాలు పెరిగాయనుకోవాలా?

(ఇంకా వుంది).